జిల్లా వార్తలు

సమ్మిట్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలి

ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్

విశాఖపట్నం, నవంబర్ 10 LIVE9 NEWS :

ఈ నెల 12, 13 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర సంబంధిత అధికారులు, సీఐఐ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేదిక వద్ద చేపడుతున్న మౌలిక సదుపాయాలు, అతిథులకు కల్పించాల్సిన సౌకర్యాలు, రవాణా, పార్కింగ్, భద్రత, పారిశుధ్యం తదితర ఏర్పాట్లను సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్దేశిత గడువులోగా అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు.

అనంతరం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు, సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. అక్కడి నుంచి వివిధ శాఖల మధ్య జరుగుతున్న సమన్వయం, అందిస్తున్న సేవలు, ఏర్పాట్ల పర్యవేక్షణకు సంబంధించిన విధానాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *