జిల్లా వార్తలు

బాలికలు ధైర్యంగా ఉండి, లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలి

– జిల్లా బాలల సంరక్షణ అధికారి కె. హరికృష్ణ*

విశాఖపట్నం, నవంబర్ 10: బాల్య వివాహ ముక్త్ భారత్ (BVMB) ప్రచారం, జాతీయ దత్తత మాసం మరియు బాలల సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మహిళా కళాశాలలో జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి కె. హరికృష్ణ మాట్లాడుతూ బాలికలు ధైర్యంగా ఉండాలని, జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే దిశగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని, ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకోవాలని తెలిపారు. విద్య, ఆరోగ్యం మరియు మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యార్థినులకు సూచించారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలు పి. రాజేశ్వరి మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం మరియు భవిష్యత్తుపై కలిగే దుష్ప్రభావాలను వివరించారు. బాల్య వివాహ నిరోధక చట్టం (PCMA) మరియు POCSO చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు, బాలలపై జరిగే లైంగిక వేధింపులను గుర్తించడం, అటువంటి సందర్భాల్లో స్పందించాల్సిన విధానాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

ప్రొటెక్షన్ ఆఫీసర్ దాసరి చంద్రశేఖర్ జాతీయ దత్తత మాసం సందర్భంగా చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ, CARA మార్గదర్శకాలు మరియు దత్తత ద్వారా సంరక్షణ అవసరమైన పిల్లలకు మంచి కుటుంబ వాతావరణం కల్పించడం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దత్తత ప్రక్రియను నిర్దేశిత చట్టబద్ధమైన విధానంలోనే చేపట్టాలని తెలిపారు.

చైల్డ్ హెల్ప్‌లైన్ సూపర్‌వైజర్ మహాలక్ష్మి మాట్లాడుతూ ఆపదలో ఉన్న పిల్లలకు అందుబాటులో ఉన్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలు, వాటి ద్వారా లభించే సహాయం, బాలల రక్షణ కోసం సంప్రదించాల్సిన విధానాలను వివరించారు. పిల్లలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థినులతో బాల్య వివాహాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. బాల్య వివాహాలను ప్రోత్సహించబోమని, తమ పరిసరాల్లో బాల్య వివాహాల సమాచారం తెలిసినప్పుడు సంబంధిత అధికారులకు తెలియజేస్తామని విద్యార్థినులు ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్, వైస్ ప్రిన్సిపాల్ ఊర్మిళ, NSS కోఆర్డినేటర్ సుశీల, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది గౌతమి, భవిత, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *